Tuesday, August 16, 2016

ఎవడి వెఱ్ఱి వాడికానందం!

గ్రుక్కెడు నీరుపోయమని ప్రతిఫలంబునాశించునా వృక్షంబు
మండుటెండలో తను మాడుచు మనకు ఛాయనిచ్చు
విసిరిన ఎంగిలిమెతుకులే కదా కుక్కలకేలనంత విశ్వాసం
ఏఘనకార్యమొనర్చెనని మర్కటమానవా కటాక్షాపితలాటకం


సుమతీ శతకంలోంచి ఒక  పద్యం తీస్కుని మళ్ళీ వ్రాసేస్తే కవిత్వం అయిపోతుందట్రా కబోది వెధవా? అంటే మరి చెప్పాల్సినవన్నీ క్లుప్తంగా ఎప్పుడో చెప్పేసారు పెద్ద పెద్దాళ్ళు... ఆ తర్వాత వచ్చిన చిన్న పెద్దాళ్ళు వాళ్ళకు తోచిందేదో విశదీకరించి వాళ్ళకు తోచనిది నాలుగు రంగులు కలిపి పబ్బాలేంటి ఏకంగా పండగలే గడిపేస్కుంటున్నారు చాలా మందే మరి... ఇంక మిగిలిన చిన్నాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు వాళ్ళకన్నీ తెలుసు, తెలీకపొయిన పెద్దగా ఉద్ధరించేదేముందిలే... వాళ్ళ ప్రపంచంలో అన్నింటికీ ఒక ధర ఉంటుంది డబ్బులు పడేసి ఏమైనా కొనేస్కోవచ్చనుకుంటారు... మరింకెవరికోసం అని నన్ను నిలదీస్తే! నేనేమన్న మిమ్మల్ని చదవమని ప్రాధేయపడ్డానా? నా పలకమీద గీసుకున్న పిచ్చిగీతలేవో చూసింది చాలక నన్ను విసుక్కుంటారే? 

Tuesday, August 9, 2016

ఇంకేం చేస్తాం... తన్నుకు ఛస్తాం ...

నాల్గిళ్ళున్నాయని నలుగురిలో జబ్బలు చరిచేము
పొడవాటి పొగబండ్లలో తిరిగి పలువురిలో పరువు జూపేము
పిరుదులు మోయలేని పలు బరువైన బిరుదులన్నీ పొందేము
సంస్కారం తప్ప సంసారంలో లేనిదేమి మా దగ్గర

ప్రకృతి జూలు విదిలిస్తే నిలువ నీడైనా మిగిలేనా
విధి వక్రిస్తే ఊరేగిన వీధులన్నా ఉండేవా
ఇసుమంతైనాలేని ఙానం పర్వతాలనుమించిన అఙానం
దీనిపేరే పెట్టుబడిదారీతనం దానికే మేం బానిసలం