Thursday, August 15, 2019

లోకం పోకళ్శు

వివరము జెప్పెడి వారులు
వందల్వేలును గాదు కోకొల్లల్కాగ
అర్ధమ్మే వ్యర్ధమ్మైనదాని
వలువలు విడిచిన విలువలు దేనికి శుంఠా!

Thursday, May 31, 2018

Sarvam midhya ra

సర్వంబు దెలియు మనుజులకెల్లా
సర్వంబు ఒడ్డుదురు సరియైన జోడి వెదుకుచు
సర్వంబు నర్పింతురు సరసపు సల్లాపుములమధ్య
సర్వంబు పోయెనని బావురుమందురు సెలయేటి పొంగు తగ్గగనే
సర్వంబు దెలిసిన వాడా సర్వంబు సర్వంబు కానీ యచట
సర్వంబు మాయరా అర్భకుడా అబ్బిగాడా 

Wednesday, November 29, 2017

దర్పపు దర్పణం [Reflection of pride]

'యువ'రాజు వెడలె రవితేజములలరగ
పూలపాంపుదెచ్చి రహదారుల పరిచెనట
ప్రక్కవీధి చూడు మురుగునీటి సంద్రమట
చిత్రపటాల ఘనచరితుల సిగలో కొత్త 'కలికి'తురాయి

Sunday, October 22, 2017

ఇంతకుముందు కూడా ఇంతేనేమో మరి...

విద్యనొసంగు వానికిన్ వివేకమ్ము కరువాయె... విద్యనేర్చిన వింతపశువులేగదా నేటి సంఘంబనిన
వైద్యమొనర్చు మనుజుండు విషపు సూదులు గ్రుచ్చె... అంతుబట్టని వింత రోగమ్ముల నెలవాయెనే పెయ్యి
దైవతత్వము వీడిరి మూఢత్వంబు ప్రవచించిరి... పక్కవాడే నిన్న, పగవాడయ్యెనే నేటికి
రాజ్య పాలకులనుచు విదూషకుల వెల్లువొచ్చె... గణతంత్రమనిన కోట్లుగుమ్మరించు  'గణిత ' శాస్త్రపు ఘనాపాటీలే మరి 

Saturday, October 15, 2016

వెఱ్ఱికి వెయ్యిన్నొకొటో తల

నిన్నునమ్మి చెడ్డవాడు లేడంటివే
నన్నమ్మి నిన్ను నమ్మితినే
నన్ను నట్టేట ముంచి నర్మగర్భంగ నేనేమెరగనంటివే
నన్ను నమ్మినవారికీ నేనేమి చెప్పవలే
నిన్నేమడుగుదును నీవల్ల కాదని తెలిసివచ్చె కదే
నిశ్చింతగా నిద్దరో సామీ నా పన్లో నేనున్నాగదానే...

నా మానాన నేను శనివారంపూట ఎవడో వాగిన ఊరసోది వింటూ బద్ధకిస్తుంటే
వీడి నకార పైత్యపు నసేంట్రా బబూ అని తిట్టుకుంటున్నారా?
తిట్టుకోండి! దాన్లో మీ తప్పేంలేదు... నా పైత్యం నా ఇష్టం మీ తిట్లు మీ ఇష్టం!

Tuesday, August 16, 2016

ఎవడి వెఱ్ఱి వాడికానందం!

గ్రుక్కెడు నీరుపోయమని ప్రతిఫలంబునాశించునా వృక్షంబు
మండుటెండలో తను మాడుచు మనకు ఛాయనిచ్చు
విసిరిన ఎంగిలిమెతుకులే కదా కుక్కలకేలనంత విశ్వాసం
ఏఘనకార్యమొనర్చెనని మర్కటమానవా కటాక్షాపితలాటకం


సుమతీ శతకంలోంచి ఒక  పద్యం తీస్కుని మళ్ళీ వ్రాసేస్తే కవిత్వం అయిపోతుందట్రా కబోది వెధవా? అంటే మరి చెప్పాల్సినవన్నీ క్లుప్తంగా ఎప్పుడో చెప్పేసారు పెద్ద పెద్దాళ్ళు... ఆ తర్వాత వచ్చిన చిన్న పెద్దాళ్ళు వాళ్ళకు తోచిందేదో విశదీకరించి వాళ్ళకు తోచనిది నాలుగు రంగులు కలిపి పబ్బాలేంటి ఏకంగా పండగలే గడిపేస్కుంటున్నారు చాలా మందే మరి... ఇంక మిగిలిన చిన్నాళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు వాళ్ళకన్నీ తెలుసు, తెలీకపొయిన పెద్దగా ఉద్ధరించేదేముందిలే... వాళ్ళ ప్రపంచంలో అన్నింటికీ ఒక ధర ఉంటుంది డబ్బులు పడేసి ఏమైనా కొనేస్కోవచ్చనుకుంటారు... మరింకెవరికోసం అని నన్ను నిలదీస్తే! నేనేమన్న మిమ్మల్ని చదవమని ప్రాధేయపడ్డానా? నా పలకమీద గీసుకున్న పిచ్చిగీతలేవో చూసింది చాలక నన్ను విసుక్కుంటారే? 

Tuesday, August 9, 2016

ఇంకేం చేస్తాం... తన్నుకు ఛస్తాం ...

నాల్గిళ్ళున్నాయని నలుగురిలో జబ్బలు చరిచేము
పొడవాటి పొగబండ్లలో తిరిగి పలువురిలో పరువు జూపేము
పిరుదులు మోయలేని పలు బరువైన బిరుదులన్నీ పొందేము
సంస్కారం తప్ప సంసారంలో లేనిదేమి మా దగ్గర

ప్రకృతి జూలు విదిలిస్తే నిలువ నీడైనా మిగిలేనా
విధి వక్రిస్తే ఊరేగిన వీధులన్నా ఉండేవా
ఇసుమంతైనాలేని ఙానం పర్వతాలనుమించిన అఙానం
దీనిపేరే పెట్టుబడిదారీతనం దానికే మేం బానిసలం